నా కొడుకు హీరో లా ఉండాలి

0d48b07f4c7c6d87_link.xxxlarge_2x
ఓ కుర్రాడు 👲
కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు😤
ఎంత కోపంతో వచ్చాడంటే..
తను చూసుకోలేదు
తన కాళ్లకు వాళ్ల నాన్న బూట్లు
వేసుకు వచ్చేశాడని.👞👞

కొడుక్కి ఒక మోటార్ సైకిల్
కొనలేని వాడు కొడుకు ఇంజనీర్
కావాలని కలలు కనడం ఎందుకో..
అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.😁

చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. 😒

ఇంటి నుండి వచ్చేప్పుడు
కోపం కొద్దీ… ఎప్పుడూ
ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు
కొట్టుకోచ్చేశాడు 😉
అమ్మకి కూడా తెలియకుండా
రాసే లెక్కలన్నీ దాంట్లోనే
ఉంటాయని వాడి నమ్మకం.👲

నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది .
కరుస్తూ ఉన్నట్టు ఉంది .
బూటు లోపల సాఫ్ట్ గా లేదు .
మడమ నొప్పెడుతోంది .😣
అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .
లోపల తడి తడి గా అనిపించింది .
కాలు ఎత్తి చూశాడు….
బూటు అడుగున చిన్న కన్నం..👞
కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు
ఎటైనా వెళ్లిపోదామని..!! 🚶

విచారణ లో వాకబు చేస్తే
తెలిసింది గంట దాకా బస్ ఏదీ లేదని 🚌

సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …
నాన్న పర్సు లో ఏంఉందో చూద్దామని
పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .👲

ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు 📄
కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు📃
అఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన మెమో📜
పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..📑
ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…

వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్😓

వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .🏃
సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు .
ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో
నాన్న లేడు. స్కూటరూ లేదు .😔
అతడికి తెలిసిపోయింది…..
నాన్న తన స్కూటర్ తీసుకొని
ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..
అతి ప్రేమగా చూసుకుంటున్న
తన స్కూటర్ ను అక్కడిచ్చి..
తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…😳

ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.😪

పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 🏃

వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,
ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు.
ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన
మోడల్ బైక్ ఏదో చూపించు..
దాని మీద నా కొడుకు హీరో లా
ఉండాలి అని చెబుతున్నాడు..👨

వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 😭
అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 👨

అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని
”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !
నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా..”
అంటూ ఏడవసాగాడు !😭

ఇంటికి వెళుతూ వెళుతూ…
తండ్రి కోసం కోఠిలో కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు
ఆ తండ్రీకొడుకులిద్దరూ….!👬

మీకోసం
తన జీతాన్నే కాదు…
జీవితాన్నీ దారపోసి….
సర్వస్వాన్నీ సమర్పించిన
ఆయన 👨
త్యాగాన్ని గుర్తించండి !🙏
బంధాన్ని గౌరవించండి !!🙏
మనసారా ప్రేమించండి !!!🙏

I LOVE MY DAD..💝

Advertisements

చూపు చీకటైనా… వెలుగుల దారి పరిచాడు!‏

260216eta1a

కోట్లు సంపాదిస్తేనే ఆనందం దక్కదు. మన సంపాదనకు కారణమైన వ్యక్తుల మొహాల్లోనూ చిరునవ్వులు విరగబూసినపుడే అది నిజమైన సంతోషం…’ -ఈ మాటలు ఏ తలపండిన వ్యక్తివో కాదు. పాతికేళ్లకే యాభై కోట్ల కంపెనీని సృష్టించిన యువకుడు శ్రీకాంత్‌వి. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నవారే ఆపసోపాలు పడుతుంటే ఈ ప్రపంచాన్ని చూడలేని తను ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.

మొదట్నుంచీ పోరాటమే…

శ్రీకాంత్‌ది మొదట్నుంచీ పోరాటబాటే. కృష్ణాజిల్లా సీతారామపురంలో పుట్టాడు. చూపులేకుండా పుట్టిన పిల్లాడిని వదిలించుకొమ్మని సలహా ఇచ్చారు ఇరుగూపొరుగూ. చదువు లేకున్నా మమకారానికి లోటులేని ఆ పేద తల్లిదండ్రులు ఆ పసిగుడ్డుని పొత్తిళ్లలో పొదువుకున్నారు. ప్రేమగా సాకడం మొదలుపెట్టారు. చదువుపై ప్రేమతో రోజూ ఐదుకిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు కాలినడకన వెళ్లి వచ్చేవాడు శ్రీకాంత్‌. అయితే తననెవరూ పట్టించుకునేవారు కాదు. వెనకబెంచీలో కూర్చొని ఒంటరితనం అనుభవించేవాడు. ఆ పరిస్థితి గమనించి హైదరాబాద్‌లో అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలలో చేర్పించాడు శ్రీకాంత్‌ నాన్న. అక్కణ్నుంచి కసిగా చదివాడు ఆ కుర్రాడు. పదోతరగతిలో తొంభైశాతం మార్కులతో పాసయ్యాడు. ఇంటర్‌లో తనకిష్టమైన సైన్స్‌లో చేరాలనుకుంటే నిబంధనలు ఒప్పుకోవు వీల్లేదన్నాయి కాలేజీలు. ప్రభుత్వంతో ఆర్నెళ్లు పోరాడాడు శ్రీకాంత్‌. న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సొంత రిస్కుమీద నచ్చిన సబ్జెక్టులో చేరేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టెక్స్ట్‌బుక్‌లను ఆడియో పుస్తకాలుగా మార్చి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. నా ఇష్టం గాలివాటం కాదని నిరూపిస్తూ ఇంటర్లో తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించాడు. తర్వాత మరో పోరాటం. అత్యుత్తమ ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ చేయాలనుకుంటే అక్కడా వెక్కిరింపే ఎదురైంది. తనను వద్దనుకున్న ఐఐటీని శ్రీకాంత్‌ కూడా త్యజించాడు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌, బెర్కిలీ, కార్నెగీమిలన్‌లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అతడికి ఎర్రతివాచీ పరిచాయి. జాలి, దయ, రిజర్వేషన్‌తోకాదు. నిఖార్సైన అతడి ప్రతిభ గుర్తించి. ఎంఐటీలో చేరాడు. వందశాతం స్కాలర్‌షిప్‌ అందుకున్నాడు.

అవకాశాలు వదిలి…

ఇంజినీరింగ్‌ పూర్తైంది. భారీ జీతంతో ఉద్యోగం ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ శ్రీకాంత్‌ లక్ష్యం అదికాదు. తనలాంటి చూపులేనివాళ్లకు వెలుగై నిలవాలనుకున్నాడు. వెంటనే ఇండియా తిరిగొచ్చి అంధుల పాఠశాలలో తనను వెన్నంటి ప్రోత్సహించిన మెంటర్‌ స్వర్ణలత గారితో కలిసి ‘సమన్వయ సొసైటీ’ ప్రారంభించాడు. అంగవైకల్యంతో ఉన్నవారికి చదువు చెప్పించడం, ఆసక్తి ఉన్న రంగాల్లో నిపుణులుగా మార్చడం సంస్థ ఉద్దేశం. మూడేళ్లలో మూడువేల మందిని తీర్చిదిద్దారు. అయితే ఎన్ని రకాలుగా వాళ్లని సానబట్టినా ఉపాధి ఇవ్వడానికి ఏ సంస్థా ముందుకురాలేదు. ఆ విసుగు, ఆలోచనల్లోంచే బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ పురుడు పోసుకుంది. శ్రీకాంత్‌ సేవింగ్స్‌, స్వర్ణలత బంగారం కుదువబెట్టి 2013 జనవరిలో సంస్థ ప్రారంభించారు. చిన్న రేకుల షెడ్డు, ఎనిమిది మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో మొదలైంది. రెండేళ్లు తిరిగేసరికి తొమ్మిది కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. వాళ్ల సదాశయం, సామర్థ్యాన్ని నమ్మి ఏంజెల్‌ ఇన్వెస్టర్లు రవి మంతా, ఎస్పీరెడ్డిలు పెట్టుబడులు పెట్టారు.

260216eta1b

సేవా వ్యాపారం

బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ కాటన్‌ బాక్స్‌లు, ప్రింటింగ్‌ ఇంక్‌, జిగురు, మిషనరీ, పేపరు ప్లేట్లు, డిస్పోజబుల్‌ గ్లాసులు, పాల ప్యాకెట్ల కవర్లు తయారు చేస్తోంది. హైదరాబాద్‌, నిజామాబాద్‌, హుబ్లీల్లో యూనిట్లున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, వూర్వశీ, గ్రీన్‌పార్క్‌, బుట్టా గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ, స్వాగత్‌ గ్రూప్‌, మెరిడీయన్‌ స్కూల్స్‌, కేఎల్‌ యూనివర్సిటీలాంటి పెద్ద హోటళ్లు, విద్యాసంస్థలు ఈ సంస్థ వినియోగదారులే. ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేసింది. దాదాపు వందకుపైగా కుటీర పరిశ్రమలకు ముడిసరుకు అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. హుబ్లీ ప్లాంట్‌లో వక్కఆకులతో ప్లేట్లు, స్పూన్‌లు తయారు చేసి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది పర్యావరణ హితమైన ప్రాజెక్టు. నెల్లూరులోని శ్రీ సిటీలో పూర్తిగా సౌరవిద్యుత్తుతో నడిచే యూనిట్‌ ఈమధ్యే ప్రారంభించారు. వీటన్నింటికీ మించి బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌లో 400 మంది ఉద్యోగుల్లో సగం మంది శారీరక, మానసిక వైకల్యం ఉన్నవాళ్లే. ఈ సంఖ్యను డెబ్భై శాతానికి పెంచడం మా లక్ష్యం అంటున్నాడు శ్రీకాంత్‌. తనలాంటి వాళ్లకు సాయపడాలనే తపన తప్ప దీంట్లో మరే ఉద్దేశం లేదు. పైగా అవకరాన్ని సాకుగా చూపి వేతనాల్లో కోత విధించరు. ఎంపిక చేసుకున్నవాళ్లకు స్వయంగా శిక్షణ ఇస్తారు. వీలైతే వాళ్లకు అనుగుణంగా యంత్రాలను తీర్చిదిద్దుకుంటారు. ఇలాంటి వాళ్లు ఎందరు వచ్చినా ఉద్యోగం ఇవ్వడానికి మేం సిద్ధం అంటున్నాడు.

టాటా మెచ్చారు…

రతన్‌టాటా జగమెరిగిన వ్యాపారవేత్త. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గిరీ వదులుకున్నాక అంకుర సంస్థల్లో ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికి ఇరవై కంపెనీల్లో పెడితే అందులో మొదటి నాన్‌ ఐటీ, మాన్యూఫాక్చరింగ్‌ కంపెనీ బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే. సహజంగానే ఈ వార్త దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది. ఎందుకిలా? ఆ సంస్థలో టాటాకి ఏం నచ్చింది? అంటే బొల్లాంట్‌లో పర్యావరణహితమైన ఉత్పత్తులు తయారవుతాయి. మార్కెట్‌లో ఎదగడానికి అనువైన పరిస్థితులున్నాయి. అంతకుమించి కంపెనీ నడిపించే నాయకుడి సామర్థ్యంపై రతన్‌ టాటాకి గురి కుదిరింది. లక్షలతో మొదలెట్టిన కంపెనీని రెండేళ్లలో యాభైకోట్ల టర్నోవరు ఉన్న సంస్థగా తీర్చిదిద్దిన శ్రీకాంత్‌ నాయకత్వాన్ని ఆయన నమ్మారు.

260216eta1c

ప్రతిభకు గుర్తింపు

 • శ్రీకాంత్‌ ఎంఐటీలో మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి.
 • జాతీయస్థాయి చదరంగం ఆటగాడు. అంధుల జాతీయ క్రికెట్‌ జట్టుకు ఆడాడు.
 • లీడ్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా అబ్దుల్‌ కలాంతో కలిసి ఐదేళ్లు పనిచేశాడు. కోయంబత్తూరు సభలో ‘శ్రీకాంతే నా రోల్‌మోడల్‌’ అని చెప్పారు కలాం.
 • ఎన్డీటీవీ వ్యాపార విభాగంలో శ్రీకాంత్‌ని ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది.
 • బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఫౌండేషన్‌ ‘క్వీన్స్‌ యంగ్‌ లీడర్‌’గా గుర్తింపు.
 • యూత్‌ బిజినెస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ బెస్ట్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవార్డు గెల్చుకున్నాడు.

జీవిత సత్యం

“జీవిత లక్ష్యం ఏమిటి” అని ఎప్పుడైనా ఓ ప్రశ్న వేసుకుంటే, మనలో చాలామందికి ఒకటే సమాధానం వస్తుంది- ‘జీవించడం’ అని. కాని- జీవించడం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమైనా ఉందా అని ఎంతమందికి అనిపిస్తుంది?

తినడం, తిరగడం, నిద్రపోవడం, చేసిన పనులే చెయ్యడం- ఇంతకు మించి జీవితంలో ఇంకేమీ కనిపించడం లేదు. అలాంటప్పుడు ‘ఈ జీవితంలో గొప్పతనం ఏముంది’ అని చాలా అరుదుగా, అతి తక్కువమంది వ్యక్తులకు అనిపిస్తుంటుంది.

జీవించక తప్పదు. జీవిస్తూనే మనిషి తన జీవితం గురించి తెలుసుకోవాలి.

మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏ ఆశయం కోసమో జీవించాలనుకుంటున్నాం. జీవించడమే మన పరమావధిగా ఉంది. దాన్నే ఓ లక్ష్యంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే అంతటినీ విషపూరితం చేస్తున్నాయి. అనేక ఆశయాల సాధనకు పెడుతున్న ఉరకలు పరుగులు చివరికి మానవ జీవిత సంగీతాన్ని ధ్వంసం చేస్తున్నాయి.

ఓ ఆశయం పెట్టుకుంటే, జీవితంతో మనం ‘యుద్ధం’ చెయ్యాలి. ఘర్షణ పడాలి. అవసరమైతే సుఖశాంతులు వదులుకోవాలి. ఒక బరువు మోసినంతగా జీవితయాత్ర సాగించాలి.

జీవితంలో అనేక సంఘటనలు, మార్పులు సంభవిస్తుంటాయి. మనిషి వాటిని గమనిస్తుండాలి. అన్ని ఆందోళనల్నీ విడిచిపెట్టాలి. జీవిత ప్రవాహ గమనాన్ని చక్కగా గమనించాలి. ఆ విధమైన సాక్షిత్వం అతడికి కచ్చితంగా బ్రహ్మానందాన్ని రుచి చూపిస్తుంది.

జీవితం కేవలం జీవించడానికే ఉంది. ఇది ఎవరి కోసమో కాదు. దేని కోసమో కాదు. ఎందుకోసమో కాదు. వాస్తవంలో ఉండే వ్యక్తే నిజంగా జీవిస్తున్నవాడు. అతడే జీవితసత్యం గ్రహించగలడు. జీవిత లక్ష్యాన్ని అందుకునేదీ ఆ మనిషే!

సముద్రంమీదకు వెళ్లేముందే, తీరాన కట్టి ఉన్న నావకు కట్టు విప్పాలని ప్రతి నావికుడికీ తెలుసు. అదేవిధంగా మానవుడూ ‘పరిపూర్ణత్వ కాంతి సాగరం’లోకి తన జీవితపు పడవ ప్రయాణం ప్రారంభించాలి. తీరం వద్ద తన పడవను కట్టాలి. కోరికల గొలుసుల్ని, ఆశయాల ముడుల్ని అతడు విప్పి తీరాలి. ఆ తరవాత తెడ్డు వేయాల్సిన అవసరం అతడికి రాదు.

శ్రీరామకృష్ణ పరమహంస ‘జీవితయానంలో నావ లంగరును ఎత్తి ఉంచు. తెరచాపల్ని లేపి సిద్ధపరచు. దివ్యమైన అనుకూల పవనాలు అనుక్షణం నీ జీవితాన్ని నడిపించేందుకు సంసిద్ధంగా ఉన్నాయి’ అనేవారు.

కేవలం పట్టాలమీదనే నడిచే రైలుబండి కాదు జీవితం. అది ఎత్తుగా ఉండే పర్వతాల నడుమ సాగుతూ, పరవళ్లు తొక్కుతూ, సాగరం వైపు పరుగులు పెట్టే నదిలాంటిది.

ఓషో అన్నట్లు- రాత్రిపూట నక్షత్రాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, మరేమీ ఆలోచించకుండా మనిషి కేవలం వాటిని దర్శించాలి. విశాలమైన కడలిమీద అలలు నాట్యాలు చేస్తున్నప్పుడు, ఏ విధమైన ఆలోచనలూ అతడు చేయకూడదు. ఆ నాట్యాన్ని తిలకిస్తూ ఉంటే చాలు. ఓ మొగ్గ… పువ్వుగా విచ్చుకుంటున్నప్పుడు,ఎటువంటి ఆలోచనలూ చేయక, పూర్తిగా అటువైపు చూస్తూనే ఉండాలి. సరిగ్గా అప్పుడే ఓ మహా రహస్యం వెల్లడవుతుంది. ప్రకృతి ద్వారం నుంచి ప్రవేశించే అనుమతి మనిషికి లభించి, దివ్య మర్మం అవగతమవుతుంది.

‘ప్రకృతి అనేది దైవాన్ని ఆవరించి ఉన్న ఓ ఆచ్ఛాదన. అంతే తప్ప, అది మరొకటి కానే కాదు. దాన్ని పక్కకు తొలగించే విధానం తెలుసుకున్న వారు జీవితసత్యంతో పరిచయం పెంచుకుంటారు’ అంటారు ఓషో!

మనమంతా విద్యార్థులమే

‘డబ్బును…సామాన్యులు దాచుకుంటారు, నాయకులు సద్వినియోగం చేస్తారు, వ్యాపారవేత్తలు రెట్టింపు చేస్తారు’ ‘మిమ్మల్ని విలువలు నడిపించినంత కాలం… చిన్నపాటి వ్యాపారం చేస్తున్నారా, బహుళజాతి సంస్థను పాలిస్తున్నారా అన్నది అప్రస్తుతం’ ‘ఆరోగ్యాన్ని పణంగాపెట్టి సాధించే గెలుపు గెలుపే కాదు’ ‘జీవితంలో చిట్టచివరి రోజు దాకా…మనమంతా విద్యార్థులమే’

సింహావలోకనం

సింహావలోకనం అనే మాట వినే ఉంటాం. సింహం ఏదైనా లక్ష్యం మీద దాడి చేయడానికి ముందు ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటుందట, చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనిస్తుందట. ఆ అవలోకనం సింహం కంటే, మనిషికే ముఖ్యం.

ఇదీ కథ

అనగనగా ఓ తాగుబోతు. అతడికి ఇద్దరు పిల్లలు. తండ్రి పెట్టే హింసల్ని భరించలేక ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. పెద్దవాడు చెడు సావాసాలతో దొంగగా మారాడు. రెండోవాడు బుద్ధిగా చదువుకుని ఉన్నత విద్యావంతుడు అయ్యాడు. ఒకేరోజు…పెద్దవాడు పోలీసులకు దొరికిపోయాడు, రెండోవాడు యూనివర్సిటీ పట్టా అందుకున్నాడు. ‘నీ విజయానికి కారణం ఏమిటి?’ అని తమ్ముడినీ ‘నీ వైఫల్యానికి కారణం ఏమిటి?’ అని అన్ననూ మీడియా అడిగింది. ‘పేదరికమే నన్ను దొంగను చేసింది’ అన్నాడు అన్న. ‘పేదరికమే నాలో కసిని రగిలించి ఉన్నత విద్యావంతుడిని చేసింది’ అని చెప్పాడు తమ్ముడు. సమస్య ఒకటే. దాన్ని స్వీకరించే పద్ధతిలోనే తేడా ఉంది. అదే నువ్వు ఎంతెత్తుకు ఎదుగుతావో, ఎంత లోతుకు కూరుకుపోతావో నిర్ణయిస్తుంది. ఇదీ కథ.

ఎవరు

ఈ సృష్టి లో ఎవరు అత్యంత అదృష్టవంతులు, శ్రీ మంతులు ?
 • ఎవరైతే ప్రేమలను, అప్యాయతలను పోందుతారో…..
 • ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో….
 • ఎవరైతే ఉన్నదాంట్లో సర్దుకుపోయి సంతృప్తిగా జీవిస్తారో‌….
 • ఎవరైతే సమాజంలో గౌరవింపబడతారో….
 • ఎవరైతే అత్మ సంతృప్తితో బ్రతుకుతారో….
 • ఎవరైతే ప్రేమను, సంతోషాన్ని ఇతరులకు పంచుతారో….
 • ఎవరైతే మానసిక ప్రశాంతతో జీవిస్తారో…..
 • ఎవరైతే కృతఘ్నతా భావం కలిగి ఉంటారో….
 • ఎవరైతే నిస్వార్థ పోకడలని కలిగి ఉంటారో….
….. వారు కేవలం శ్రీ మంతులు, అదృష్టవంతులె కాదు సంతోష సామ్రాజ్యానికి అధిపతులు కూడా….

” సిరులు ఉన్నంత మాత్రాన సుఖం ఉండదు.
పుస్తకం దగ్గర ఉన్నంత మాత్రాన జ్ఞానవంతుడు కాడు. “