రణతిక్కన సొదరుడు మైలమభీముడు. ఇతను కూడా మహాశూరుడు, భీమకవి అనుగ్రహమును కలిగినవాడు.ఈ మైలమభీమునికి యుద్ధము నందు విజయమే తప్ప పరాజయమెన్నడూ కలుగకుండే విధంగా వేములవాడ భీమకవి వరమిచ్చారు. ఆ వరము వలన ఎప్పుడూ ఈ మైలమభీమునికి పరాజయమను మాటే లేకుండెను. యుద్ధములో శత్రువులను ఓడించగల సామర్థ్యము అబ్బింది. భీమకవి ఇతని శౌర్యపరాక్రమమును గురించి ఎన్నో అద్భుతపద్యాలతో వివరించారు. వాటిలో కొన్ని మాత్రమే దొరికాయి.
చ గరళపు ముద్ద లోహ మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోఱలు పట్టకార్లు ది
క్కరటి శిరంబు దాయి లయకారుడు కమ్మరి – వైరివీర సం
హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గసృష్టికిన్
భావము: లయకారకుడైన శివుడే స్వయాన కమ్మరియై, తన కంఠాన దాచుకున్న కాలకూటవిషమునే (గరళపుముద్ద) ఇనుపలోహముగా మార్చి, దద్దిల్లుతూ కోట్లకొలదిగా రాలే పిడుగులను సమ్మెటలుగా(దభీదభీమని మోదే సుత్తులు) వాడి, తన కనుమంటలనే కొలిమిగా చేసి, తన మెడలో ధరించిన సర్పరాజు వాసుకి యొక్క కోరలనే పట్టుకార్లుగా చేసి, ఎనిమిది దిక్కులా భూమిని మోస్తూ ఉన్న అష్టదిగ్గజాలలో (ఎనిమిది ఏనుగులు) ఒక ఏనుగును తలదాయిగామార్చి, శత్రుసంహారములో, గుణాలలో రాముడంతటివాడైన మైలమ భీముని ఖడ్గమును సృష్టించాడు.
అది ఎంత భయంకరమైన ఖడ్గమో మనం ఊహించుకోవలసిందే! భీమకవి వర్ణించిన మైలమభీముని ఖడ్గం ఎంత శక్తివంతమైనదో, శత్రువులపాలిట ఎలా మృత్యుసమానమైనదో ధ్వనించే పద్యమిది. తెలుగు సాహిత్యం మొత్తంలోనూ ఇంతకన్నా భయంకరంగా ఒక ఖడ్గాన్ని గూర్చి వర్ణించిన పద్యం మరొకటి లేదు! ఈ భీషణవాక్కు వేములవాడ భీమకవిది.
ఈ మైలమభీమన చాలా పరాక్రమశాలి, సాటిలేని ధైర్యసాహసాలు కలవాడిగా చరిత్ర ప్రసిద్ధుడు. ఇతను పిడుగు పడుతూంటే సాహసంతో దానిని తన కత్తితో నరికినట్లు “పిడుగు నర్కిన చిక్కభీమావనీపతి” అని మరో చాటుపద్యంలో ఉంది. ఇంతటి ప్రసిద్ధమైన ఈ ఖడ్గం కొన్ని సంవత్సరాల కిందటి వరకూ పూసపాటి రాజుల సంస్థానంలో భద్రంగా ఉన్నట్టు చెప్పేవారు.
ఈ మైలమభీముని కీర్తి గురించి పొగుడుతూ భీమకవి చెప్పిన ఇంకో పద్యం ఇది.
ఉ నేరుపు బ్రహ్మఁ జేరె నిజనిర్మల తేజము సూర్యుఁ జేరెఁ నా
కారము కాముఁ జేరెఁ నధికంబగు లక్ష్మియనంతుఁ జేరె గం
భీరత వార్థిఁ జేరెఁ గల పెంపు కులాద్రుల జేరెఁ గీర్తి దా
నూరట లేక త్రిమ్మరుచు నున్నది మైలమ భీముఁడీల్గినన్
భావము: మైలమ భీముని మరణము తర్వాత అతని నైపుణ్యం బ్రహ్మను చేరింది. అతని తేజస్సు సూర్యుణ్ణి చేరింది. రూపము మన్మధుణ్ణి చేరింది. అతని సంపద (లక్ష్మి) విష్ణువును చేరింది. గాంభీర్యము సముద్రాన్ని చేరింది. ఔన్నత్యము కులపర్వతాలను చేరింది. కానీ మరణము వలన అతని కీర్తి మాత్రం ఎక్కడ చేరాలో తోచక ఈ లోకంలోనే తిరుగుతున్నదట. అనగా నేర్పు మొదలగు గుణాలలో అతనికి సమానులుగా చెప్పదగిన బ్రహ్మాదులున్నారు. కానీ అతని మరణం తర్వాత కీర్తికి ఆశ్రయం లభించలేదంటే అతనితో సమానకీర్తి గల మరొక ఆశ్రయమేదీ ప్రపంచములో లేదని అతడు అసమాన కీర్తిశాలి అని భావము.
మైలమభీముని పరాక్రమమును గురించి కొనియాడుతూ భీమకవి ఎన్నో అద్భుతపద్యాలను రచించాడు.
పూర్తి చరిత్ర కొరకు: http://shrivemulawadabheemakavi.blogspot.in/p/blog-page_3993.html