చూపు చీకటైనా… వెలుగుల దారి పరిచాడు!‏

260216eta1a

కోట్లు సంపాదిస్తేనే ఆనందం దక్కదు. మన సంపాదనకు కారణమైన వ్యక్తుల మొహాల్లోనూ చిరునవ్వులు విరగబూసినపుడే అది నిజమైన సంతోషం…’ -ఈ మాటలు ఏ తలపండిన వ్యక్తివో కాదు. పాతికేళ్లకే యాభై కోట్ల కంపెనీని సృష్టించిన యువకుడు శ్రీకాంత్‌వి. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నవారే ఆపసోపాలు పడుతుంటే ఈ ప్రపంచాన్ని చూడలేని తను ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.

మొదట్నుంచీ పోరాటమే…

శ్రీకాంత్‌ది మొదట్నుంచీ పోరాటబాటే. కృష్ణాజిల్లా సీతారామపురంలో పుట్టాడు. చూపులేకుండా పుట్టిన పిల్లాడిని వదిలించుకొమ్మని సలహా ఇచ్చారు ఇరుగూపొరుగూ. చదువు లేకున్నా మమకారానికి లోటులేని ఆ పేద తల్లిదండ్రులు ఆ పసిగుడ్డుని పొత్తిళ్లలో పొదువుకున్నారు. ప్రేమగా సాకడం మొదలుపెట్టారు. చదువుపై ప్రేమతో రోజూ ఐదుకిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు కాలినడకన వెళ్లి వచ్చేవాడు శ్రీకాంత్‌. అయితే తననెవరూ పట్టించుకునేవారు కాదు. వెనకబెంచీలో కూర్చొని ఒంటరితనం అనుభవించేవాడు. ఆ పరిస్థితి గమనించి హైదరాబాద్‌లో అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలలో చేర్పించాడు శ్రీకాంత్‌ నాన్న. అక్కణ్నుంచి కసిగా చదివాడు ఆ కుర్రాడు. పదోతరగతిలో తొంభైశాతం మార్కులతో పాసయ్యాడు. ఇంటర్‌లో తనకిష్టమైన సైన్స్‌లో చేరాలనుకుంటే నిబంధనలు ఒప్పుకోవు వీల్లేదన్నాయి కాలేజీలు. ప్రభుత్వంతో ఆర్నెళ్లు పోరాడాడు శ్రీకాంత్‌. న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సొంత రిస్కుమీద నచ్చిన సబ్జెక్టులో చేరేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టెక్స్ట్‌బుక్‌లను ఆడియో పుస్తకాలుగా మార్చి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. నా ఇష్టం గాలివాటం కాదని నిరూపిస్తూ ఇంటర్లో తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించాడు. తర్వాత మరో పోరాటం. అత్యుత్తమ ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ చేయాలనుకుంటే అక్కడా వెక్కిరింపే ఎదురైంది. తనను వద్దనుకున్న ఐఐటీని శ్రీకాంత్‌ కూడా త్యజించాడు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌, బెర్కిలీ, కార్నెగీమిలన్‌లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అతడికి ఎర్రతివాచీ పరిచాయి. జాలి, దయ, రిజర్వేషన్‌తోకాదు. నిఖార్సైన అతడి ప్రతిభ గుర్తించి. ఎంఐటీలో చేరాడు. వందశాతం స్కాలర్‌షిప్‌ అందుకున్నాడు.

అవకాశాలు వదిలి…

ఇంజినీరింగ్‌ పూర్తైంది. భారీ జీతంతో ఉద్యోగం ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ శ్రీకాంత్‌ లక్ష్యం అదికాదు. తనలాంటి చూపులేనివాళ్లకు వెలుగై నిలవాలనుకున్నాడు. వెంటనే ఇండియా తిరిగొచ్చి అంధుల పాఠశాలలో తనను వెన్నంటి ప్రోత్సహించిన మెంటర్‌ స్వర్ణలత గారితో కలిసి ‘సమన్వయ సొసైటీ’ ప్రారంభించాడు. అంగవైకల్యంతో ఉన్నవారికి చదువు చెప్పించడం, ఆసక్తి ఉన్న రంగాల్లో నిపుణులుగా మార్చడం సంస్థ ఉద్దేశం. మూడేళ్లలో మూడువేల మందిని తీర్చిదిద్దారు. అయితే ఎన్ని రకాలుగా వాళ్లని సానబట్టినా ఉపాధి ఇవ్వడానికి ఏ సంస్థా ముందుకురాలేదు. ఆ విసుగు, ఆలోచనల్లోంచే బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ పురుడు పోసుకుంది. శ్రీకాంత్‌ సేవింగ్స్‌, స్వర్ణలత బంగారం కుదువబెట్టి 2013 జనవరిలో సంస్థ ప్రారంభించారు. చిన్న రేకుల షెడ్డు, ఎనిమిది మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో మొదలైంది. రెండేళ్లు తిరిగేసరికి తొమ్మిది కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. వాళ్ల సదాశయం, సామర్థ్యాన్ని నమ్మి ఏంజెల్‌ ఇన్వెస్టర్లు రవి మంతా, ఎస్పీరెడ్డిలు పెట్టుబడులు పెట్టారు.

260216eta1b

సేవా వ్యాపారం

బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ కాటన్‌ బాక్స్‌లు, ప్రింటింగ్‌ ఇంక్‌, జిగురు, మిషనరీ, పేపరు ప్లేట్లు, డిస్పోజబుల్‌ గ్లాసులు, పాల ప్యాకెట్ల కవర్లు తయారు చేస్తోంది. హైదరాబాద్‌, నిజామాబాద్‌, హుబ్లీల్లో యూనిట్లున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, వూర్వశీ, గ్రీన్‌పార్క్‌, బుట్టా గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ, స్వాగత్‌ గ్రూప్‌, మెరిడీయన్‌ స్కూల్స్‌, కేఎల్‌ యూనివర్సిటీలాంటి పెద్ద హోటళ్లు, విద్యాసంస్థలు ఈ సంస్థ వినియోగదారులే. ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేసింది. దాదాపు వందకుపైగా కుటీర పరిశ్రమలకు ముడిసరుకు అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. హుబ్లీ ప్లాంట్‌లో వక్కఆకులతో ప్లేట్లు, స్పూన్‌లు తయారు చేసి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది పర్యావరణ హితమైన ప్రాజెక్టు. నెల్లూరులోని శ్రీ సిటీలో పూర్తిగా సౌరవిద్యుత్తుతో నడిచే యూనిట్‌ ఈమధ్యే ప్రారంభించారు. వీటన్నింటికీ మించి బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌లో 400 మంది ఉద్యోగుల్లో సగం మంది శారీరక, మానసిక వైకల్యం ఉన్నవాళ్లే. ఈ సంఖ్యను డెబ్భై శాతానికి పెంచడం మా లక్ష్యం అంటున్నాడు శ్రీకాంత్‌. తనలాంటి వాళ్లకు సాయపడాలనే తపన తప్ప దీంట్లో మరే ఉద్దేశం లేదు. పైగా అవకరాన్ని సాకుగా చూపి వేతనాల్లో కోత విధించరు. ఎంపిక చేసుకున్నవాళ్లకు స్వయంగా శిక్షణ ఇస్తారు. వీలైతే వాళ్లకు అనుగుణంగా యంత్రాలను తీర్చిదిద్దుకుంటారు. ఇలాంటి వాళ్లు ఎందరు వచ్చినా ఉద్యోగం ఇవ్వడానికి మేం సిద్ధం అంటున్నాడు.

టాటా మెచ్చారు…

రతన్‌టాటా జగమెరిగిన వ్యాపారవేత్త. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గిరీ వదులుకున్నాక అంకుర సంస్థల్లో ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికి ఇరవై కంపెనీల్లో పెడితే అందులో మొదటి నాన్‌ ఐటీ, మాన్యూఫాక్చరింగ్‌ కంపెనీ బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే. సహజంగానే ఈ వార్త దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది. ఎందుకిలా? ఆ సంస్థలో టాటాకి ఏం నచ్చింది? అంటే బొల్లాంట్‌లో పర్యావరణహితమైన ఉత్పత్తులు తయారవుతాయి. మార్కెట్‌లో ఎదగడానికి అనువైన పరిస్థితులున్నాయి. అంతకుమించి కంపెనీ నడిపించే నాయకుడి సామర్థ్యంపై రతన్‌ టాటాకి గురి కుదిరింది. లక్షలతో మొదలెట్టిన కంపెనీని రెండేళ్లలో యాభైకోట్ల టర్నోవరు ఉన్న సంస్థగా తీర్చిదిద్దిన శ్రీకాంత్‌ నాయకత్వాన్ని ఆయన నమ్మారు.

260216eta1c

ప్రతిభకు గుర్తింపు

  • శ్రీకాంత్‌ ఎంఐటీలో మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి.
  • జాతీయస్థాయి చదరంగం ఆటగాడు. అంధుల జాతీయ క్రికెట్‌ జట్టుకు ఆడాడు.
  • లీడ్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా అబ్దుల్‌ కలాంతో కలిసి ఐదేళ్లు పనిచేశాడు. కోయంబత్తూరు సభలో ‘శ్రీకాంతే నా రోల్‌మోడల్‌’ అని చెప్పారు కలాం.
  • ఎన్డీటీవీ వ్యాపార విభాగంలో శ్రీకాంత్‌ని ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది.
  • బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఫౌండేషన్‌ ‘క్వీన్స్‌ యంగ్‌ లీడర్‌’గా గుర్తింపు.
  • యూత్‌ బిజినెస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ బెస్ట్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవార్డు గెల్చుకున్నాడు.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s